అన్న వస్తాడు కష్టాలు తీరుస్తాడు..!

ఎన్నికల సంధర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇద్దరు నేతలు చురుగ్గా ప్రచారాలు చేస్తున్నారు. నేడు ఏపిగ సి‌ఎం చంద్రబాబు కేంద్రం పై నిరసనగా ధర్మపోరాటం దీక్ష చేస్తుండగా, ప్రతిపక్ష నేత వై‌ఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై‌ఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో వైసీపీ సమర శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్నారు. సభలో ఆయన డ్వాక్రా మహిళలకు వరాలజల్లు కురిపించారు. వృద్ధాప్య పెన్షన్, ఆరోగ్యశ్రీ గురించి ప్రస్తావించారు.

బ్యాంకుల్లో అప్పులు కట్టలేక ఇబ్బందులు పడుతున్న ఆడపడుచులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నివిధాలుగా ఆదుకుంటుందని, డ్వాక్రా మహిళలకు ఎంత అప్పు ఉన్నా ఆ అప్పును రద్దు చేసే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున అన్నగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడని తెలిపారు.

మరోవైపు అన్న చేయూత పథకం ద్వారా ప్రతీ మహిళకు నాలుగు దఫాలుగా రూ.75వేలు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ప్రతీ ఇంటి నుంచి పిల్లలను బడికి పంపితే చాలు వారి బాధ్యతను తానే చూసుకుంటానని హామీ ఇచ్చారు. చదువుకుంటున్న ప్రతీ విద్యార్థి ఇంటికి ఏడాదికి రూ.15వేలు చెల్లిస్తానని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు.

అంతేకాదు అనారోగ్యం పాలైన ప్రతీ వ్యక్తికి మెరుగైన వైద్యం అందించే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలిపారు. రూ.1000 దాటితే దాన్ని ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వమే చెల్లిస్తోందని భరోసా ఇచ్చారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ, బెంగళూరు వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ వర్తించేలా చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.

వృద్ధులకు వృద్ధాప్య పింఛన్ ను రూ.2000 నుంచి రూ.3000 వరకు పెంచుకుంటూ పోతానని హామీ ఇచ్చారు. ప్రతీ వైసీపీ కార్యకర్త ప్రజలకు చెప్పాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటెస్తే ఏం చెయ్యబోతున్నామో అన్నది ప్రతీ అవ్వకు వివరించాలని తెలిపారు. అన్నవస్తాడు కష్టాలు తీరుస్తాడని భరోసా ఇవ్వాలని తెలిపారు.

The post అన్న వస్తాడు కష్టాలు తీరుస్తాడు..! appeared first on MahaaNews.

Go to Mahaa News

Please like and share us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *