కేరళ – పరశురామ సృష్టా?

భారత దేశంలోని ఎన్నో ప్రాంతాలకు చాలా ప్రాచీన, దివ్య చరిత్ర ఉంది. కొన్నిటికి పురాణేతిహాసాల్లో ప్రస్తావన ఉంటే, కొన్ని చారిత్రికంగా ఏర్పడ్డాయి. అలా ఒక అద్భుతమైన చరిత్రతో కూడుకున్న ప్రాంతం కేరళ.

కేరళ ఎలా ఉద్భవించింది అనే దాని గురించి కొన్ని పురాణాలు, చరిత్రలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది – అది పరశురామ సృష్టి అన్నది.

పరశురాముడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆరో దివ్యావతారం. ‘పరశువు’ అంటే గండ్రగొడ్డలి – గండ్రగొడ్డలి ఆయుధంగా గల రాముడు కనుక ‘పరశురాముడు’. ఆ కాలంలో రాజ్యపాలన చేస్తున్న రాజవంశీకుల అరాచకాలకు చరమగీతం పాడే లక్ష్యంతో ఆయన అవతరించారు. దుర్మతులైన పాలకులు అందరినీ తన ఆయుధంతో ఆయన సంహరించారు. వారి రక్తంతో అయిదు ఏర్లు పారించారని ప్రతీతి. వీరందరినీ సంహరించాక తన పాపాల ప్రాయశ్చిత్తం కోసం ఆయన రుషి సంఘాన్ని ఉపాయం కోసం ప్రార్ధించారు. వారంతా ఆయన సాధించిన భూభాగాన్ని బ్రాహ్మణులకు దానం ఇచ్చి తన పాపం నుంచి పరిహారం పొందవచ్చని తరుణోపాయం సూచించారు.

వారు సూచించిన విధంగానే ఆయన గోకర్ణంలో ధ్యానంలో కూర్చున్నారు. అక్కడ ఆయనను సముద్ర జలాల దేవుడు వరుణుడు, భూదేవి ప్రసన్నమై దీవించారు. వారి ఆదేశం మేరకు గోకర్ణం నుంచి ఆయన కన్యాకుమారికి చేరుకొని సముద్రం మీదుగా తన పరశువును ఉత్తర దిశగా విసిరారు. ఆ పరశువు పడిన ప్రాంతం కేరళ. అది గోకర్ణానికి – కన్యాకుమారికి మధ్య 160 కాటంల (భూ భాగాన్ని కొలిచేందుకు ప్రాచీన ప్రమాణం) భూభాగం. తాను క్షత్రియులను వధించిన పాపాన్ని పోగొట్టుకునేందుకు ఆయన ఉత్తర భారతం నుంచి 64 బ్రాహ్మణ కుటుంబాలను తెచ్చి కేరళలో ఉంచారని అంటారు. పురాణాల ప్రకారం కేరళను ‘పరశురామ క్షేత్రం’ అని కూడా వ్యవహరిస్తారు – అంటే ఆయన సముద్రం నుంచి రాబట్టిన భూభాగం అని అర్ధం.

లోకంలో ఇంకో ఐతిహ్యం కూడా ప్రచారంలో ఉంది. శ్రీరామచంద్రుల వారు శివ ధనుర్భంగం కావించిన సందర్భంలో పరశురాముల వారు తన గురువు అయిన శివుని విల్లు విరిచినదెవరో తెలుసుకోడానికి అక్కడికి వచ్చి రామావతారాన్ని తన అంశగానే గుర్తించి శాంతుడై తన కళలను ఆయన యందు ఉంచి ఈ భూభాగం రాములవారికి వదలి వేసి సముద్రం పైకి పరశువును విసిరి తన కంటూ వేరే భూభాగం సృష్టించుకున్నారని, అది కేరళ దేశం అయిందని కూడా ప్రచారంలో ఉంది.

ఐతిహ్యం ఏదైనప్పటికీ, కేరళ దేవుని స్వంత భూమిగా ఇప్పటికీ తన ప్రత్యేకతను నిలుపుకుంటోంది. అక్కడి ప్రక్రుతి రమణీయత, దివ్యౌషదాల సౌలభ్యం, వివిధ దేవతల ప్రముఖ దేవాలయాలతో నిత్యం ఆధ్యాత్మికతతో ఓలలాడే కేరళ దేశాన్ని భారతీయులంతా తప్పక సందర్శించాల్సిందే.

Go To Bharatiya Sampradayalu

Please like and share us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *